పకడ్బందీగా పోలింగ్
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల: మొదటి విడతలో జరిగే పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామగ్రిని సరిచూసుకుని ఎక్కడా కూడా పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. పీఓ అందరూ కూడా వారికి కేటాయించిన గ్రామపంచాయతీలకు సాయంత్రంలోగా చేరుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి తిరిగి రిసెప్షన్ కేంద్రానికి వచ్చేవరకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మల్లీఖార్జున్ ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


