
ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి
గట్టు: జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. గురువారం గట్టులో సోషల్ అడిట్‌పై ప్రజావేదికను నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు 27 గ్రామ పంచాయతీల్లో రూ.5.64 కోట్ల విలువ కల్గిన ఉపాధి హామీ పథకం ద్వారా పనులను చేపట్టారు. ఈ పనులకు సంబంధించి సామాజిక తనిఖి బృందాలు క్షేత్ర స్థాయిలో ఆడిట్ నిర్వహించారు. ఎస్‌ఆర్‌పీ భద్రునాయక్ ఆధ్వర్యంలో 11మంది డీఆర్‌పీలు, ఏవీఓ శ్రీనివాస్‌లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఆడిట్ నిర్వహించారు. గ్రామాల వారీగా నిర్వహించిన ఆడిట్ నివేదికను ప్రజావేదికలో వెల్లడించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పండ్ల తోటలు, కాంటూరి కందకాలు, ఫీడర్ చానల్, వాలు కట్టల నిర్మాణాలు, పశువుల కొట్టాల నిర్మాణం వంటి పనులు చేపట్టడడం జరుగుతుందని తెలిపారు. వీటిని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. రైతులకు, గ్రామస్తులకు శాశ్వతంగా ఉపయోగ పడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇదే క్రమంలో ఉపాధి నిధులను దుర్వినియోగం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుని, దుర్వినియోగం అయిన నిధులను వెనక్కి రాబడుతామన్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఓ స్వామి, వివిధ గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు.