
అందరికీ సంక్షేమ ఫలాలు
గద్వాల: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని అధికారంలోకి వచ్చిన 48గంటల్లోనే అమలు చేస్తూ సీఏం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని.. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఏం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ప్రజల ఆత్వగౌరవానికి ప్రతీకగా నిలిచిన రేషన్‌కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూలై 14వ తేదీన ప్రారంభించామన్నారు. పదేళ్ల తరువాత మళ్లీ ప్రజలకు కొత్త రేషన్‌కార్డులు అందించామన్నారు. ఉగాది పండుగ నుంచే ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. జిల్లాలో 1,81,352 రేషన్‌కార్డు లబ్ధిదారులకు 4058 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటాయించడం జరిగిందన్నారు.
జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులను ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను ఆకట్టుకున్నాయి. బాలభవన్ నాట్య మయూరి నృత్యశిక్షణ కేంద్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, మార్కెట్‌యార్డు చైర్మన్లు హనుమంతు, దొడ్డప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అందరికీ సంక్షేమ ఫలాలు