
శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించాలి
గద్వాల/అలంపూర్: జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రధానంగా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. అదేవిధంగా వీఐపీల ప్రోటోకాల్ విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వేడుకలకు వచ్చే భక్తులకు తాగునీటిని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రసాద్‌స్కీమ్ భవన్‌లో నీటికొరత తలెత్తకుండా ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. పారిశుద్ధ్య పనులను పక్కాగా చేపట్టి ఆలయ ప్రాంగణం, ఘాట్‌పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అలంపూరు వరకు, అలంపూర్ నుంచి దేవస్థానం వరకు బస్సులను పెంచాలన్నారు. నీటిప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎస్‌డీఆర్‌ఎఫ్ ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించేలా మెడికల్ క్యాంపు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని, విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో అలివేలు, దేవాలయశాఖ ఈవో దీప్తి, మిషన్‌భగీరథ ఇంట్రా, గ్రిడ్ ఈఈలు శ్రీధర్‌రెడ్డి, పరమేశ్వరి, ఆర్‌అండ్‌బి ఈఈ ప్రగతి, ఇరిగేషన్‌శాక ఈఈ శ్రీనివాస్‌రావు, డీఎస్పీ మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధికారులకు ఆహ్వానం
జోగుళాంబ ఆలయంలో జరిగే శరన్ననవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ జిల్లా అధికారులను ఆహ్వానించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ దీప్తి ఆలయ ధర్మకర్తలు.. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ లక్ష్మినారయణను బుధవారం కలిశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో హాజరుకావలని కోరుతూ ఆహ్వానం పలికారు. వీరితోపాటు ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, సరస్వతి, అడ్డాకుల రాము, జగన్ గౌడు, గోపాల్, జయన్న, నాయకులు జోగుల రవి తదితరులు ఉన్నారు.
జోగుళాంబ ఆలయంలో
పకడ్బందీ ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు
రాకుండా చర్యలు
కలెక్టర్ బీఎం సంతోష్