
ఎర్రబారుతున్న పత్తి..!
వాతావరణంలో మార్పులతో తెగుళ్ల బెడద తీవ్రం
ధరూరు: పత్తి రైతుపై వాతావరణం పగబట్టింది. ఎన్నడూ లేనిది వానాకాలానికి నెల రోజుల ముందే వరుణుడు పలకరించడం.. పంట వేసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పత్తి పంటకు తెగుళ్ల బెడద తీవ్రమైంది. ఈ ఏడాది వర్షాలు ముందస్తుగా పలకరించగా జూరాల ప్రాజెక్టుకు రెండు నెలల ముందే వరద నీరు వచ్చింది. అదే తరుణంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సాగు నీరు రావడంతో పంట సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు తెగుళ్లతో నిరాశే మిగిలింది. గతేడాది సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ తాము ఈ సారైనా గట్టెక్కుతాము అనుకున్న రైతులకు గడ్డు పరిస్థితే ఎదురైంది. వాతావరణ మార్పుల ప్రభావం.. అధిక వర్షాల ప్రభావంతో మొన్నటి వరకు కళకళలాడుతున్న పత్తి పంట రైతు కళ్లెదుటే ఎర్రబారిపోతుంది. ఎన్ని రకాల మందులు కొట్టినా.. అడుగు మందులు పెట్టినా పంటలను కాపాడుకోలేకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,85,148 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. ఎర్రతెగుళ్లతో 40వేల నుంచి 50వేల వరకు పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
40వేల నుంచి 50వేల ఎకరాలపై ప్రభావం
నడిగడ్డ ప్రాంతంలో సీడ్‌తోపాటు కమర్షియల్ పత్తిని అధికంగా సాగు చేస్తారు. పత్తిపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఈ సారి నష్టాలే మిగిలాయి. జిల్లాలో మొత్తం 1,85,148 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. 30 నుంచి 40శాతం వరకు ఎర్రతెగుళ్ల ప్రభావం పడింది. దీనిపై ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ఎలాంటి సర్వే చేపట్టలేదు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మొత్తం పంటలు 3,55,700
వరి
86,318
వేరుశనగ 5,825
కంది
19,476
మొక్కజొన్న 11,337
జిల్లాలో వానాకాలం సీజన్‌లో పంటల సాగు ఇలా..
పంటంతా నాశనమైంది
ఎకరం పొలంలో పత్తి పంటను సాగు చేశాను. ఎన్ని మందులు కొట్టినా.. అడుగు మందులు పెట్టినా పంట కుదుట పడడంలేదు. నాలాంటి చాలా మంది రైతుల పొలాల్లో ఎర్ర తెగులు సోకి పంటంతా పూర్తిగా నాశనమై పోయింది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
– ఆంజనేయులు, రైతు, సోంపురం
యూరియా అందకనే..
సకాలంలో పంటలకు మందులు అందిస్తేనే బాగుంటాయి. మార్కెట్‌లో సకాలంలో ఎరువులు అందడం లేదు. ముఖ్యంగా యూరియా అందక నానా అవస్థలు పడుతున్నాం. డీలర్లను అడిగితే రాలేదు అంటున్నారు. ప్రభుత్వం సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి.
– శాంతన్న, రైతు, ధరూరు
ఎర్ర తెగులుతో దిగుబడిపై తీవ్ర ప్రభావం
సకాలంలో ఎరువులు అందక మరిన్ని ఇక్కట్లు
పంట నష్ట పరిహారం అందించాలని రైతుల వేడుకోలు

ఎర్రబారుతున్న పత్తి..!

ఎర్రబారుతున్న పత్తి..!

ఎర్రబారుతున్న పత్తి..!