
వసతిగృహాలను విధిగా తనిఖీ చేయాలి
● విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
● క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి
● జోగుళాంబ ఆలయం, పలు వసతిగృహాలు, పాఠశాలల సందర్శన
అలంపూర్/ఉండవెల్లి: వసతిగృహాలను జిల్లా, మండల అధికారులు విధిగా తనిఖీ చేయాలని, సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం ఆయనతోపాటు డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ అలంపూర్ ప్రభుత్వ ఎస్సీ బాలికల, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో 145 మంది విద్యార్థులకుగాను 45 మంది గైర్హాజర్ అవగా.. అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాలను జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని, ఆయా సమస్యలపై జిల్లా అధికారులతో మాట్లాడతాని చెప్పారు. వీరితోపాటు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెన్న, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, రాష్ట్ర అడ్వజరీ కమిటి సభ్యుడు మహ్మద్ ఇస్మాయిల్, నాయకులు గట్టు తిమ్మప్ప, నరసింహ్మ మహేష్ గౌడ్ ఉన్నారు.
ఉండవెల్లి పాఠశాలకు రూ.కోటి మంజూరు
ఉండవెల్లిలో అసంపూర్తిగా నిలిచిన జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ఎంపీ, సీఎస్‌ఆర్ నిధులు రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలను ఎంపీ పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈక్రమంలో చిన్న ఆముదాలపాడు గ్రామానికి చెందిన విద్యార్థులు నడుచుకుంటూ పాఠశాలకు వస్తామని తెలపడంతో 8 నుంచి 10 వ తరగతి కి చెందిన విద్యార్థుల వివరాల తెలుసుకుని వారికి సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మారుమూల గ్రామాలకు సకాలంలో బస్సు వచ్చేలా కలెక్టర్, డిపో అధికారులతో మాట్లాడతానన్ని అన్నారు. నాయకులు గట్టు తిమ్మప్ప, వెంకటేష్ గౌడు, నాగేష్, రమేష్ పాల్గొన్నారు.
యునెస్కో గుర్తింపు తీసుకరావాలి
ఇదిలాఉండగా, అలంపూర్ ఆలయాలకు యునెస్కో గుర్తింపు తీసుకురావాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ ఎర్రవల్లి బాలుర గురుకులాన్ని సందర్శించారు.