
సమస్యల పరిష్కారానికి కృషి
అలంపూర్: సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు సోమవారం పలు సమస్యలపై కర్నూల్‌లోని నివాసంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎర్రవల్లి మండలం బీచుపల్లి దేవస్థానం వద్ద 44వ జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మించాలని బీచుపల్లి, కొండపేట గ్రామస్తులు, నాయకులు కోరారు. అండర్‌పాస్ లేకపోవడంతో జాతీయరహదారిపై రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. అయిజ మున్సిపాలిటీకి చెందిన పర్దిపురం వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీరాములు, రామకృష్ణ గౌడ్, గంగాధర్, శివ యాదవ్, నరేష్, ఆంజనేయులు గౌడ్, ఆంజనేయులు, నరసింహలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీగా ఉన్న పర్దిపురంనుంచి మున్సిపాలిటీఈలో కలిపినట్లు తెలిపారు. మున్సిపాలిటికి దూరంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో వార్డుగా ఉన్న తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా మార్పు చేయాలని కోరారు. అదేవిధంగా స్థానికంగా కొందరు అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని, దీనిని ఆపాలన్నారు. అలాగే, వడ్డేపల్లి మండలం జూలకల్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలని, జూలకల్ స్టేజీ నుంచి గ్రామానికి ఒక కిలోమీటర్ పైప్‌లైన్ వేసి ట్యాంకు నీరందిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని తెలిపారు. పలు వినతులు స్వీకరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వాటి పరిష్కారానికి సానుకులంగా స్పందించినట్లు తెలిపారు.
శాంతిభద్రతల
పరిరక్షణకే కార్డెన్‌సెర్చ్
గద్వాల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో అపరిచితులు, అనుమానాస్పదంగా ఎవరైనా తచ్చాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని చింతలపేట కాలనీలో డీఎస్పీ మొగిలయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే సంఘటనలు జరగకుండా ముందుస్తుగా ప్రతి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీలో ఎవరికై న ఇళ్లు అద్దెకు ఇచ్చే క్రమంలో వారి వ్యక్తిగత సమాచారం, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు తదితర పత్రాలను చూడాలన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100కు సంప్రదించాలన్నారు. సరైన ధృవపత్రాలు లేని పలు వాహనాలను స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉండగా, ఓ వ్యక్తి నుంచి 70 పాకెట్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, ఎస్‌ఐలు సతిష్‌రెడ్డి, జహగీర్ తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
అయిజ: మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకపోవడంతో పారిశుద్ధ్యం పడకేసిందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని అఖిలపక్ష కమిటీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు సోమవారం మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు పట్టణంలో ప్రధాన రోడ్లపై ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈమేరకు ఏఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. మున్సిపలిటీలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు రూ.15 కోట్ల ఎస్టిమేషన్ కాపీని సీడీఎంఏ కార్యాలయానికి సమర్పించామని, నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.
‘యూరియా’ ఇక్కట్లు
గట్టు: రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గట్టులోని పీఏసీఎస్ వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీరారు. టోకెన్ల కోసం ఒక లైను, ఇది వరకే టోకన్లు తీసుకున్న వారు యూరియా కోసం మరో లైను ఏర్పాటు చేశారు. యూరియా లేక పంటలు ఎదుగుదల లేదని రైతులకు అవసరమైన యూరియాను అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

సమస్యల పరిష్కారానికి కృషి