
రాయితీ.. ఉత్తిమాటే!
కూరగాయలు, మిరప రైతులకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం
●
గద్వాల వ్యవసాయం: ఉద్యాన పంటల విత్తనాలను 50శాతం రాయితీపై ఇస్తామన్న సర్కార్ హామీ నీటిమూటగానే మారింది. ఏడేళ్ల క్రితం వరకు ఆర్‌కేవీవై (రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన) పథకం కింద కూరగాయల విత్తనాలను రాయితీపై అందించే వారు. ప్రస్తుతం ఈ పథకం తీగజాతి కూరగాయల సాగుకు ఏర్పాటుచేసే పందిళ్లకే పరిమితమైంది. కూరగాయలు, మిర్చి పండించే రైతుల ఆశలు అడియాశలుగానే మారాయి.
జిల్లాలో విస్తారంగా సాగు..
జిల్లాలో ఉద్యాన పంటలకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా రెండు సీజన్‌లలో విస్తారంగా పండిస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ధరూర్ మండలంలో బెండ, టమాట మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ఉల్లి, అలంపూర్‌లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా పండిస్తారు. ఇక ఎండుమిర్చి సాగుపై ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల, ఉండవెల్లి, రాజోళి, అయిజ, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఏటా దాదాపు 30వేల ఎకరాలకు పైగా ఎండుమిర్చి సాగు అవుతోంది.
సబ్సిడీపై విత్తనాలు అందించాలి..
నాకున్న మూడెకరాల్లో ఏటా రెండు సీజన్‌లలో కూరగాయలు పండిస్తాను. ఏడేళ్ల క్రితం వరకు కూరగాయల విత్తనాలు, మార్కెట్‌కు తరలించడానికి ట్రేలు సబ్సిడీపై ఇచ్చే వారు. దీనివల్ల పెట్టుబడి భారం కొంత తగ్గేది. ఇప్పుడు సబ్సిడీ లేకపోవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సబ్సిడీపై విత్తనాలు అందించాలి. – సుదర్శన్‌రెడ్డి,
కూరగాయల రైతు, గద్వాల
పెట్టుబడులు
పెరుగుతున్నాయి..
నాకున్న ఆరెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని గతేడాది వరకు ఎండుమిర్చి సాగు చేశాను. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ధరలు రావడం లేదు. విత్తనాలకే వేలకు వేలు అవుతున్నాయి. అందుకే ఈఏడాది మూడెకరాల్లో మాత్రమే వేశాను. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తే కొంత పెట్టుబడి సాయం అవుతుంది. – వెంకటేశ్వర్లు, మిర్చిరైతు,
చిన్నిపాడు, మానవపాడు మండలం
పందిళ్లకు మాత్రమే..
ఆర్‌కేవీవై పథకం కింద తీగజాతి కూరగాయలు పండించేందుకు అవసరమైన పందిళ్లను 50 శాతం రాయితీపై అందిస్తాం. ఇక కూరగాయల, ఎండుమిర్చి విత్తనాలను రాయితీపై అందించడం లేదు.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి
భారంగా మారిన విత్తనాల కొనుగోలు
ఆర్‌కేవీవై పథకంతో లబ్ధి చేకూరని వైనం
నీటిమూటగానే మారిన సర్కారు హామీ
పందిళ్లకే పరిమితం..
ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా కూరగాయల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్‌కేవీవై పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలతో పాటు, ట్రేలు, తీగజాతి కూరగాయలకు అవసరమయ్యే పందిళ్లకు 50శాతం రాయితీ అందించే వారు. దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకునే వారు. పండించిన కూరగాయలను మార్కెట్‌కు తరలించడానికి వినియోగించే ట్రేళ్లను కూడా రాయితీపై తీసుకునేవారు. అయితే ఆర్‌కేవీవై పథకం కింద ఇవన్నీ 2015–16 వరకు అందించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ పథకం కేవలం పందిళ్ల ఏర్పాటుకే పరిమితమైంది.

రాయితీ.. ఉత్తిమాటే!

రాయితీ.. ఉత్తిమాటే!

రాయితీ.. ఉత్తిమాటే!