
వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు
గద్వాల: వానాకాలంలో పండించే వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదే విధంగా ధాన్యంపై క్వింటాల్‌కు పెరిగిన మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరికరాలను వెంటనే మార్కెట్ కమిటీలకు అప్పగించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి పుష్పమ్మ, డీఎస్‌ఓ స్వామికుమార్, డీఎం విమల, జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు, ఏఓ సిద్ధయ్య తదితరులు ఉన్నారు.
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
అలంపూర్/మల్దకల్/మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్ అధ్యాపకులకు సూచించారు. మంగళవారం అలంపూర్, మల్దకల్, మానవపాడు జూనియర్ కళాశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు అధ్యాపకుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జూనియర్ కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకులు ఉన్నారన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా చొరవ చూపాలన్నారు. రాష్ట్ర కమిషనర్, కార్యదర్శి ఆదేశాల మేరకు అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. అలంపూర్, మానవపాడు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కళాశాల ల్యాబ్‌కు సంబంధించిన ఇన్‌ఫ్రా కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి శనివారం విద్యార్థులతో క్రీడలు ఆడించాలన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ సీఏ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా సమయ పట్టిక రూపొందించాలని సూచించారు. విద్యార్థుల ఆపార్ నమోదు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాల్స్ పద్మావతి, కృష్ణ, పద్మావతి పాల్గొన్నారు.
రేపు జాతీయ చేనేత దినోత్సవం
గద్వాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించనున్నట్లు చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుంచి అనంత ఫంక్షన్‌హాల్ వరకు నిర్వహించే ర్యాలీలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఫ్యాషన్ షో ఉంటుందన్నారు. అదే విధంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పాఠశాల పరిశీలన
ధరూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం యునెస్కో ప్రతినిధి సైదులు పరిశీలించారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్వహణ, వాటి శుభ్రత, తాగునీరు, తడి, పొడి చెత్త నిర్వహణ, తరగతి గదుల శుభ్రత తదితర వాటిపై వివరాలు నమోదు చేసుకున్నారు. పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులు, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. ఆయన వెంట జీహెచ్‌ఎం ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు

వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు