
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గద్వాల: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో రాష్ట్రంలో కోటిమంది మహిళలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్‌బంకులు, మహిళాశక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేసి.. ప్రతినెలా రూ.లక్ష ఆదాయం పొందే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. పెట్రోల్‌బంకు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నాలుగు ఎకరాల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. గద్వాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపై మంజూరు చేయడం జరిగిందన్నారు. గద్వాల మండలంలో 1,587 కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడంతో పాటు 4,877 మంది పేర్లను కొత్తగా రేషన్‌కార్డుల్లో చేర్చినట్లు తెలిపారు. అంతే కాకుండా మహిళా సంఘాలకు రూ. 50.61లక్షల వడ్డీలేని రుణాలతో పాటు 53 సంఘాలకు రూ. 7.87కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రుణ చెక్కులతో పాటు లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు పాల్గొన్నారు.