
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
గద్వాలన్యూటౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో ధర్నా చేపట్టగా.. పలు సంఘాలు, పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అద్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలన్నారు. కేజీబీవీలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని.. గురుకులాల్లో పనిచేస్తున్న వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్నారు. అనంతరం డీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి ఉదయ్‌కిరణ్, సీపీఎం కార్యదర్శి వెంకటస్వామి, సీఐటీయూ కార్యదర్శి నర్సింహ, రిటైర్డ్ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ఆర్.మోహన్, స్వామి, అబ్దుల్‌బాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీపీఎస్ బిల్లులు చెల్లించాలని, రిటైర్డ్ అయిన రోజే అన్నిరకాల బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామన్‌గౌడ్, ఇక్బాల్, రవికుమార్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, అతికూర్ రహ్మన్, గోపాల్, కురువ పల్లయ్య, ప్రభాకర్, వినోద్ పాల్గొన్నారు.