
ఆగని మట్టి దందా..!
అనుమతుల్లేకుండానే ఎర్రమట్టి తరలింపు
విజిలెన్స్ అధికారులు
పరిశీలించినా..
ఎర్రమట్టి తరలింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ఇటీవల రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ర్యాలంపాడు, సుల్తానాపురం గుట్టలను పరిశీలించారు. దీంతో కొన్ని రోజులు తాత్కాలికంగా నిలిచాయి. ఆ తర్వాత యథావిధిగానే మట్టి తరలింపులు కొనసాగిస్తున్నారు. గుట్టల నుంచి తరలిన మట్టి వివరాలు ఇవ్వాలని జిల్లా మైనింగ్ అధికారులను రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కోరినట్లు సమాచారం. ఆ మేరకు జిల్లా మైనింగ్ అధికారులు 648 మెట్రిక్ టన్నుల మేర మట్టి తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. కానీ స్థానికంగా మాత్రం ఈ నివేదికపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 10 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగానే ఎర్రమట్టి తరలింపులు జరిగినట్లు స్థానికంగా చర్చకొనసాగుతుంది.
అలంపూర్: ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అలంపూర్ మండలంలోని సుల్తానాపురం, ర్యాలంపాడులోని ప్రభుత్వ గుట్టలే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా ఎర్ర మట్టి తరలింపులు కొనసాగుతున్నాయి. కనీస అనుమతులు లేకుండానే మట్టి తరలింపులు కొనసాగిస్తున్నారు. నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారుల ముందే భారీ వాహనాల ద్వారా తరలింపులు జరుగుతున్నా కట్టడి చేయడానికి చేపట్టే చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి.
రాత్రింబవళ్లు మట్టి తరలింపులు
సుల్తానాపురం గ్రామ శివారులోని 29/11 సర్వే నంబర్‌లోని గుట్టల నుంచి ఎర్రమట్టి తరలింపులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రి పగలు అక్రమార్కులు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. రోజుకు 50 నుంచి 60 టిప్పర్ల ద్వార మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అధికారులు సైతం భారీ స్థాయిలో మట్టి తరలి వెళ్తున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుండటంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులు
మైనింగ్ అధికారుల నివేదికలపై స్థానికంగా చర్చ
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు
అలంపూర్ మండలం ర్యాలంపాడు, సుల్తానాపురం గ్రామాల శివారు నుంచి ఎర్రమట్టి తరలింపునకు ఎలాంటి అనమతులు లేవు. అనుమతుల కోసం ఎవరూ మైనింగ్ శాఖను సంప్రదించలేదు. అక్రమంగా మట్టి తరలింపు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణ, మైనింగ్ ఆర్‌ఐ