
సమయపాలన పాటించని వైద్యులకు నోటీసులు
గద్వాల: జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో సమయపాలన పాటించని వైద్యులపై జిల్లా వైద్యాధికారి చర్యలకు ఉపక్రమించారు. జిల్లా ఆస్పత్రితోపాటు పలు పీహెచ్‌సీలను శుక్రవారం ‘సాక్షి’ విజిట్ చేయగా.. పలువురు వైద్యులు, సిబ్బంది విధులకు ఆలస్యంగా హాజరుకావడంతో రోగులు గంటల పాటు వైద్యం కోసం నిరీక్షించారు. దీనిపై ‘వైద్యం కోసం నిరీక్షణ’ శీర్షికన శనివారం ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. దీంతో కథనానికి డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప స్పందించారు. సమయపాలన పాటించని గట్టు, అయిజ, మల్దకల్, అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల పీహెచ్‌సీ మెడికల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు వివరణ కోరామని.. వారు ఇచ్చే వివరణల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ ‘సాక్షి’తో తెలిపారు.
భారీ వర్షాలతో
అప్రమత్తంగా ఉండాలి
గద్వాల: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవి అన్నారు. శనివారం కలెక్టర్ బీఎం సంతోష్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, సీజనల్ వ్యాధులతోపాటు చికున్‌గున్యా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. కృష్ణా, తుంగభద్ర నదీపరివాహారక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని, తాగునీరు కలుషితం కాకుండా పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి వాటికి మరమ్మతులు చేపట్టామని, క్లోరినేషన్, పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు అవరమైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఏవో సక్రియానాయక్, ఇరిగేషన్‌శాఖ ఈఈ శ్రీనివాస్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రగతి, డీపీవో నాగేంద్రం, డీఎస్‌వో స్వామికుమార్, ఉద్యావనశాఖ అధికారి అక్బర్, డీఎస్పీ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రిలో
అరుదైన శస్త్రచికిత్స
గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించామని, వైద్యులు అన్ని పరీక్షు నిర్వహించగా హెర్నియా అని గుర్తించారన్నారు. సదరు మహిళ కొన్నేళ్లుగా దీని వల్ల బాధపడుతూ ఉన్నారన్నారు. ఈమేరకు శనివారం ఏడుగురితో కూడిన వైద్య బృందం నాలుగు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారన్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే, ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితి సైతం విషమంగా ఉండగా వైద్య బృందం శస్త్రచికిత్స చేశారని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. శస్త్ర చికిత్సలో వైద్యులు విపంచి, కేచరి, విజయభాస్కర్, స్పందన, షఫి తదితరులు ఉన్నారన్నారు.