
కేసుల్లో పురోగతి సాధించాలి
● ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
● జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
గద్వాల క్రైం/ఎర్రవల్లి: కేసుల విచారణలో వీలైనంత త్వరగా పురోగతి సాధించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, ఎర్రవల్లి మండలంలోని కోదండాపురం సిఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావుతో శాంతిభద్రతల పరిరక్షణలో తీసుకున్న చర్యలు, సిబ్బంది పనితీరుపై, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, నిషేధిత మత్తు పదార్థాలు, నకిలీ విత్తనాలు తదితర వాటికి సంబంధించి వివరాలు వాకబు చేశారు. విధుల్లో సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని, రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. జిల్లాకు ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, వాటికి సంబంధించిన నివేదికలను పరిశీలించారు. అనంతరం జిల్లా సాయుధ బలగాల కార్యాలయం, గద్వాల రూరల్ పోలీసు స్టేషన్ డీఐజీ సందర్శించి స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు.
● అదేవిధంగా కోదండాపురం సిఐ కార్యాలయం ఆవరణలో డీఐజీ, ఎస్పీ మొక్కలు నాటారు. ప్రతి పోలీస్‌శాఖ భూములలో, పోలీస్‌స్టేషన్ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఐజీ సూచించారు. సర్కిల్ పరిదిలోని అన్ని పీఎస్‌లలో డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించేలా చూడాలన్నారు. అలాగే బ్లూకోర్ట్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించేలా ఆయా ఎస్‌ఐలు చర్యలు చేపట్టాలని సిఐ రవిబాబుకి సూచించారు. డీఐజీ వెంట ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్‌రావు, సీఐలు నాగేశ్వరెడ్డి, శ్రీను, టాటాబాబు, రవిబాబు, ఎస్‌ఐలు శ్రీకాంత్, కళ్యాణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
జోగుళాంబ ఆలయ సన్నిధిలో డీఐజీ
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాన్ని శనివారం డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ శ్రీనివాస్‌రావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం డీఐజీ, ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు డీఎస్పీ మొగులయ్య, ఎస్‌ఐ వెంకటస్వామి తదితరులు ఉన్నారు.