భావితరాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి

మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి  - Sakshi

వనపర్తి: ఎమ్మెల్యే అంటే నాలుగు శంకుస్థాపనలు చేసి.. సీసీరోడ్లు, డ్రెయినేజీ, కమ్యూనిటీ హాల్‌ నిర్మించడం కాదని.. భావితరాల భవిష్యత్‌ కోసం చిత్తశుద్ధితో పనిచేయడమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పెద్దమందడి మండలం వెల్టూరు శివారులోని గోపాల సముద్రం చెరువు శిఖం ప్రదేశంలో నిర్వహించిన మండల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావుతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరూ ఊచించని విధంగా నియోజకవర్గంలో 15 చెక్‌డ్యాంలు నిర్మించానని, ప్రస్తుతం ఒక్కో చెరువులా కనిపిస్తున్నాయని చెప్పారు. మొదట్లో తాను ఓడిపోయినా.. సీఎం కేసీఆర్‌ తమ్ముడిగా భావించి మంత్రి హోదాకు సమానమైన ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారన్నారు. ఆనాటి నియోజవర్గానికి అనుకుని కృష్ణానది పారుతున్నా.. చుక్క సాగునీరు ఈ నేలను తాకలేదన్నారు. వ్యవసాయమే జీవనాధారమైన పల్లెసీమలను పచ్చగా చూడాలని దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2018 సాధారణ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసే సమయానికి నియోజకవర్గంలోని 70 వేల ఎకరాలకు సాగునీరందించానని గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. ఇక్కడ చర్చించిన అంశాలను, భవిష్యత్‌లో ప్రభుత్వం చేసే పనుల గురించి మీ ప్రాంతంలో వివరిస్తారనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామన్నారు. ఎమ్మెల్సీ రవీందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావంతోనే వలసల జిల్లాగా ఉన్న పాలమూరు పచ్చని పంటల పొలాలతో సస్యశ్యామలమైందని, పనికోసం ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు వసలొచ్చే రోజులు వచ్చాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకుల వెన్నంటే ఉంటూ.. పనిచేయాలని కార్యకర్తలు, నాయకులను కోరారు.

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top