అపార నష్టం | Sakshi
Sakshi News home page

అపార నష్టం

Published Sat, Mar 18 2023 1:34 AM

క్యాతూర్‌ గ్రామంలో తడిసిన పప్పుశనగ కుప్పలను సరి చేస్తున్న రైతులు  - Sakshi

అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

పంట నాశనం

అకాల వర్షంతో మునగ పంట మొక్కలు విరిగి నేలకొరిగి దెబ్బతింది. పిచికారీ చేసి కూలీలతో కలుపు తీసేందుకుకే దాదాపు రూ.లక్ష ఖర్చు వచ్చింది. పంట పూర్తిగా దెబ్బతినడంతో మొత్తం రూ.1.50 లక్షలకు పైగా నష్టమొచ్చింది. వ్యవసాయ అధికారులు కూడా పరిశీలించారు. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలి.

– తెలుగు ఆంజనేయులు,

రైతు, మారమునగాల–1

అలంపూర్‌/ఉండవెల్లి/మానవపాడు/గట్టు: అకాల వర్షానికి జిల్లాలో అన్నదాతలకు అపారనష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్లకు తీసుకురాగా ఒక్కసారిగా కురిసిన వర్షాలకు తడిసి ముద్దయ్యింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, పప్పుశనగ తడిసిపోయింది. గద్వాల మార్కెట్‌, అలంపూర్‌లో పప్పుశనగ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. గద్వాలలో ధాన్యం రైతుల కళ్లముందే కొట్టుకుపోతుంటే కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. అలంపూర్‌ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో విక్రయించేందుకు పంటపొలాల్లోని కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. రాసులుగా పోసిన మిర్చి కింది నుంచి నీళ్లు వచ్చి కొట్టుకుపోయింది.

స్థలం లేక పంటపొలంలో..

అలంపూర్‌ మండలం క్యాతూర్‌ పీఏసీఎస్‌ అధికారులు పప్పుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. స్థానికంగా కార్యాలయం వద్ద స్థలం లేకపోవటంతో గ్రామసమీపంలోని ఓ రైతు పంటపొలంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు విక్రయించేందుకు ధాన్యం రాసులు పోసుకున్నారు. 15 రోజులుగా పప్పుశనగ ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో అకాల వర్షానికి తడిసిపోయింది. అధికారులు నిర్లక్ష్యంగా కనీసం గన్నీబ్యాగులు కూడా ఇవ్వలేదని తక్కశీల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు ఇక్కడ మార్కెట్‌, గోదాంలు లేకపోవటంతో ఏళ్ల తరబడి పండించిన పంటను అమ్ముకునేందుకు తమ పంటపొలాల్లోనే రాసులుగా పోసుకున్నారు. అకాల వర్షంతో మిర్చి రాసులు మొత్తం తడిసిపోయాయి. గద్వాల జిల్లాలో ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 11 మంది రైతులకు చెందిన 35 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 10 ఎకరాలు మినుములు, 8 ఎకరాలు చెరుకు, ఎండుమిర్చి 10 ఎకరాలు, మునగ 7 ఎకరాలు ఉంది. తడిసిన ధాన్యంతో అనేక మంది రైతులు నష్టాలపాలయ్యారు.

● మానవపాడు మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్‌ యాదగిరి శుక్రవారం తెలియజేశారు. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా మందుస్తుగా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిర్చి పంటను తెంచిన రైతులు కల్లాల్లో పంట తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

● ఉండవెల్లిలో విద్యుత్‌ స్తంభాలు, హరితహారం మొక్కలు, వృక్షాలు నేలకొరిగాయి. మండలంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. మొక్కజొన్న పంట దాదాపు 15 ఎకరాల్లో నేలమట్టమైంది. పప్పుశనగ పంట కోసి పెట్టడంతో తడిసి నేలపాలైంది. మారమునగాలలో ఎకరన్నర మునగపంట వర్షానికి విరిగిపోయి దెబ్బతిందని మండల వ్యవసాయ అధికారి సురేఖ తెలియజేశారు. ఉండవెల్లి ఫీడర్‌లో 5 విద్యుత్‌ స్తంభాలు, కంచుపాడు ఫీడర్‌లో 3 స్తంభాలు నేలకొరిగాయి.

గట్టులో పొగాకు రైతులతో పాటు మామిడి రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం పొగాకు పంట చేతికందగా.. ఆకులను తోరణాలుగా పేర్చి పొలాల్లో ఆరబెట్టుకున్నారు. ఆరుబయట ఆరబెట్టిన పొగాకు అకాల వర్షం కారణంగా దెబ్బతింది.

కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లోని

వేరుశనగ, మిర్చి, పప్పుశనగ

పంటకు భారీ నష్టం

గన్నీబ్యాగులు, టార్పాలిన్‌లు

అందుబాటులో ఉంచని అధికారులు

అష్టకష్టాలు పడుతున్న రైతులు

చెన్నిపాడులో తడిసిన మిర్చి పంటను సరిచేస్తున్న రైతు కూలీలు
1/3

చెన్నిపాడులో తడిసిన మిర్చి పంటను సరిచేస్తున్న రైతు కూలీలు

గట్టు శివారులో వర్షానికి తడిసిన పొగాకును ఆరబెట్టుకున్న రైతులు
2/3

గట్టు శివారులో వర్షానికి తడిసిన పొగాకును ఆరబెట్టుకున్న రైతులు

3/3

Advertisement
Advertisement