దందా ఆగేనా? | - | Sakshi
Sakshi News home page

దందా ఆగేనా?

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

పోలీసుల విచారణలో.. ఎస్పీ సీరియస్‌ ఒకరు పోతే మరొకరు.. శాశ్వత పరిష్కారం ఏది..

సరిహద్దులు దాటుతున్న రేషన్‌ బియ్యం

భూపాలపల్లి: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ (పీడీఎస్‌) బియ్యం ఏళ్ల తరబడి పక్కదారి పడుతోంది. అధికారుల తనిఖీలు, పోలీసులు, పౌరసరఫరాల అధికారులు కేసుల నమోదు నిత్యం కొనసాగుతున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు. ఒకరు పట్టుబడితే మ రొకరు తెరపైకి వస్తూ ఈ దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరిస్తున్నారు. తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తుండటంతో అక్రమార్కులు సరికొత్త మార్గాల్లో సరిహద్దులు దాటిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.

తాజాగా శనివారం జిల్లాలో వెలుగుచూసిన పీడీఎస్‌ బియ్యం కుంభకోణం దందా ఏ స్థాయిలో జరుగుతుందో కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. భూపాలపల్లి పట్టణంలోని సీఆర్‌ నగర్‌కు చెందిన మోటం శ్రీనివాస్‌ అనే వ్యక్తికి మహారాష్ట్ర సిరొంచకు చెందిన రైస్‌మిల్లు యజమాని వీరయ్య సేటుతో మూడేళ్లుగా పరిచయం ఉంది. ఈ క్రమంలో వీరయ్యతో శ్రీనివాస్‌ తగు ఒప్పందం కుదర్చుకొని, మండలాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని, వారితో రేషన్‌ బియ్యం సేకరణ చేపట్టేవాడు. పెద్ద మొత్తంలో బియ్యం సమకూర్చుకున్నాక డీసీఎం వ్యాన్‌, ట్రాలీల్లో వీరయ్య సేటు మిల్లుకు పంపించేవాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పూర్తి ఆధారాలతో శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి, అతనికి ఏజెంట్లుగా వ్యవహరించిన వారిపై సైతం కేసు నమోదు చేశారు.

రేషన్‌ బియ్యం దందా చేస్తున్న పలువురు డాన్‌లు స్థానిక పోలీసు, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులకు నెలవారి మామూళ్లు అందిస్తున్నట్లు సమాచారం. మామూళ్లు తీసుకుంటున్న అధికారులు.. సదరు డాన్‌లకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న విషయం, రేషన్‌ బియ్యం దందా గురించి ఇటీవల ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన ఈ దందాపై ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఈ తరహా దందా కొత్తదేమీ కాదు. గతంలో కూడా ప్రతీ మండలానికి ఒక దళారి ఉండి రేషన్‌ బియ్యాన్ని సేకరించి ఇతర ప్రాంతాలకు పంపేవారు. పోలీసులు నిఘా పెట్టి కొందరిని అరెస్టు చేసినా, ఆ స్థానంలోకి కొత్త వ్యక్తులు వస్తూనే ఉన్నారు. పాత నేరస్తులు జైలు నుంచి రాగానే లేదా వారి వెనుక ఉన్న కొత్త అనుచరులు మళ్లీ ఇదే దందాను ప్రారంభిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడం, లబ్ధిదారులు కూడా బియ్యాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడటంతో దళారుల పని సులువవుతోంది.

కొంతమంది కాసులకు కక్కుర్తి పడుతున్నా, మరికొందరు మచ్చలేని వివిధ శాఖల అధికారులు రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఎప్పటికప్పుడు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ దందాను మూలాల నుంచి నిర్మూలించలేకపోతున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచడంతో పాటు, రేషన్‌ బియ్యం అమ్ముకునే కార్డుదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం కనిపించడం లేదు. అధికారులు కేవలం ఏజెంట్లపైనే కాకుండా, బియ్యం కొనుగోలు చేస్తున్న రైస్‌మిల్లు యజమానులు, వెనక ఉండి నడిపిస్తున్న పెద్ద తిమింగలాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిందితులు పట్టుబడుతున్నా మారని తీరు

కొత్త నీరులా తెరపైకి దళారులు

యథేచ్ఛగా రీ సైక్లింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement