భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కూటమికి మద్దతు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ కార్మికులను కోరారు. ఆదివారం భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో కార్మికులను కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు భద్రత, సంక్షేమం కల్పించడంతోపాటు పెండింగ్ బకాయిల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. 2025 వేతన సవరణను పే స్కేల్‌గా మార్చడం, గ్యారేజీ హక్కులు సాధించడం, వర్క్‌షాప్ కార్మికులకు పని గంటల రేటు విడుదల చేయించడం, మహిళా కండక్టర్లకు పిల్లల సంరక్షణ కోసం సెలవులు కల్పించడం తమ ప్రధాన డిమాండ్లన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల రమేశ్, కార్యదర్శి క్యాతరాజు సతీష్, నాయకులు జి.సుధాకర్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్, కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్, నాయకులు నూకల చంద్రమౌళి, జోసెఫ్, కేటీపీపీ రీజినల్ కమిటీ నాయకులు కోలా శ్యామ్,కిరణ్ పాల్గొన్నారు.
సింగరేణి ఆస్తులు ధ్వంసంచేస్తే ఊరుకోం
భూపాలపల్లి అర్బన్: రోడ్డు విస్తరణ పేరుతో సింగరేణి సంస్థకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బడితల సమ్మయ్య, అప్పాని శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీ వైపు వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చిరు వ్యాపారుల దుకాణాలతో పాటు సింగరేణి కమ్యూనిటీ హాల్, కార్మిక సంఘాల కార్యాలయాల ప్రహరీలను కూల్చే ప్రయత్నాన్ని కార్మికులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేసే చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా సింగరేణి ఆస్తులను కూల్చేయడం సరికాదన్నారు. కూల్చివేసిన ఆస్తులను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. చర్యలు నిలిపివేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో భాసనపల్లి కుమారస్వామి, కాగితపు సురేష్, లక్ష్మణ్, సుజేందర్ పాల్గొన్నారు.
మేడారంలో మొక్కుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలసంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, సమర్పించారు. సంతానం కలగాలని మహిళలు రావి చెట్టు వద్ద ముడుపులు కట్టారు.


