డుమ్మాకొడితే దొరికినట్టే! | - | Sakshi
Sakshi News home page

డుమ్మాకొడితే దొరికినట్టే!

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

హాజరుపై పకడ్బందీ నిఘా

ఉద్యోగుల హాజరుకు ‘మీ ప్రమాణం’ యాప్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల హాజరు, సమయపాలన విషయంలో జిల్లా యంత్రాంగం ఇక కఠిన వైఖరి అవలంభించనుంది. విధులకు ఆలస్యంగా రావడం, సమాచారం లేకుండా గైర్హాజరు కావడం వంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ఈ నెల రెండో వారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో మీ ప్రమాణం యాప్‌ ద్వారా ఉద్యోగుల హాజరు నమోదు తప్పనిసరి చేయనున్నారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశాల మేరకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో 40కి పైగా డిపార్ట్‌మెంట్‌లలో ఐదు వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఆలస్యానికి అడ్డుకట్ట

ఉద్యోగుల హాజరు విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా సాంకేతికతను అస్త్రంగా మార్చుతున్నారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ యాప్‌ ద్వారా తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. విధులకు సకాలంలో హాజరు కావడం, కార్యాలయ సమయాలను పాటించడం తప్పనిసరి కానుంది.

మినహాయింపు మాటే లేదు

మీ ప్రమాణం యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలని ఇటీవల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మినహాయింపులు ఉండవని స్పష్టం చేయడంతో అధికారులు, సిబ్బందిలో హాజరు విషయంలో అప్రమత్తత తప్పనిసరి కానుంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది యాప్‌లో నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

ముందు అవగాహన.. ఆ తర్వాత కఠిన అమలు

యాప్‌ వినియోగంపై ఈడీఎం ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు రోజుల పాటు అవగాహన కల్పించారు. సాంకేతిక కారణాలు లేదా యాప్‌పై అవగాహన లేకపోవడాన్ని కారణంగా చూపకుండా ముందుగానే సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే ఉద్యోగుల సమయపాలన, విధి నిర్వహణలో క్రమశిక్షణ కీలకం. ఈ నేపథ్యంలో మీ ప్రమాణం యాప్‌ అమలు ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయనుంది.

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు..

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఈ యాప్‌ను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దీని ఆధారంగానే ప్రతీ నెల వేతనాలు చెల్లించనున్నారు. పూర్తిస్థాయిలో అమలు తరువాత ఫలితాలను బట్టి అమలు చేయనున్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వ శాఖలు వేర్వేరు యాప్‌ల ద్వారా ఉద్యోగుల హాజరు నమోదు చేస్తున్నారు. సాధారణ హాజరు విధానాలకు స్వస్తి పలుకుతూ యాప్‌ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఒకే డ్యాష్‌ బోర్డ్‌లో సమీకరించి ఉద్యోగుల హాజరు, విధుల నిర్వహణ, పనితీరును పారదర్శకంగా పర్యవేక్షించే అవకాశం ఏర్పడనుంది. కార్యాలయానికి వచ్చామా.. రాలేదా అన్న విషయంపై స్పష్టత ఉండేలా రికార్డు నమోదవుతుంది.

వినియోగంపై విడతల వారీగా శిక్షణ

ఈ నెల రెండో వారం నుంచి

తప్పనిసరి

జిల్లాలో 5వేల మంది ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement