పర్యావరణ పరిరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు చర్యలు

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

భూపాలపల్లి అర్బన్‌: శాసీ్త్రయ పద్ధతిలో భూగర్భ గనులను మూసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ ఆదేశించారు. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్‌లో సైంటిఫిక్‌ మైన్‌ క్లోజర్‌, గనుల పునరుద్ధరణ, సుస్థిర భూ వినియోగం అంశం నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తొలిసారిగా 42 బొగ్గు గనులను శాసీ్త్రయ పద్ధతిలో మూసివేసి పర్యావరణహిత ప్రాంతాలుగా అభివృద్ధి చేసిన అనుభవాలను ప్రతిబింభించే నివేదికను కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. గనుల మూసివేత అనంతరం చేపట్టాల్సిన పర్యావరణ పునరుద్ధరణ, స్థానిక ప్రజల జీవనోపాధి, ఉపాధి అవకాశాల సృష్టి, భూవినియోగం, మైన్‌ క్లోజర్‌ నిబంధనల అమలు వంటి అంశాలపై జిల్లా స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ వర్చువల్‌లో పర్యావరణ అధికారి పోషమల్లు, సీనియర్‌ ఎస్టేట్‌ అధికారి జి.రాజు, అధికారులు పాల్గొన్నారు.

జీపీ భవనానికి తాళం

చిట్యాల: మూడేళ్ల క్రితం రూ.20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఇటీవల నిధులు వచ్చినా సర్పంచ్‌ ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్‌ దంపతులు బానోత్‌ జవహర్‌–లత బుధవారం కార్యాలయానికి తాళంవేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ ఘటన చిట్యాల మండలం లక్ష్మీపూర్‌తండాలో చోటు చేసుకుంది. బానోత్‌ జవహర్‌–లత మాట్లాడుతూ లక్ష్మీపూర్‌తండా గ్రామ పంచాయతీ భవనం మూడేళ్ల క్రితం నిర్మించగా బిల్లు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు, గ్రీవెన్‌ సెల్‌లో కూడా ఫిర్యాదు చేయగా.. నెల రోజుల కిత్రం బిల్లులు మంజూరు చేసినట్లు తెలిపారు. బిల్లులు ఇవ్వకుండా వాటిని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తుత సర్పంచ్‌ నిలిపి వేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్పంచ్‌ని అడుగుదామంటే స్థానికంగా ఉండడం లేదన్నారు. ఈ విషయంపై సర్పంచ్‌ను వివరణ కోరగా నిర్మాణం అసంపూర్తిగా ఉండడం మూలంగా బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు.

అడవులను పరిశీలించిన అధికారులు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని చెల్పూరు, భూపాలపల్లి, మహదేవపూర్‌ అటవీ రేంజ్‌ల పరిధిలోని అడవులను బుధవారం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు గణేష్‌ కుమార్‌, రంగస్వామి, కాళేశ్వరం జోన్‌ సీసీఎఫ్‌ ప్రభాకర్‌ పరిశీలించారు. నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 180 హెక్టార్ల అటవీశాఖ భూములు కోల్పోవడంతో అక్కడి అటవీ భూములకు బదులుగా జిల్లాలో 180 హెక్టారుల్లో అడవుల్లో అభివృద్ధి పనులతో పాటు మొక్కలు పెంచడానికి ప్రతిపాదిత ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జిల్లాలో అడవుల అభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లాకేంద్రంలోని అటవీ కాంప్లెక్స్‌లో అధికారులు మొక్కలు నాటారు. అంతరిస్తున్న అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, అడవులుంటేనే భవిష్యత్‌ తరాల వారికి మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా సీసీఎఫ్‌ ప్రభాకర్‌ తెలిపారు. ఈకార్యక్రమంలో డీఎఫ్‌ఓ క్రిష్టాగౌడ్‌, భూపాలపల్లి, మహదేవపూర్‌ అటవీ డివిజన్ల ఎఫ్‌డీఓలు, పలు రేంజ్‌ల ఎస్‌ఆర్‌ఓలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మాణ పనుల పరిశీలన

మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డు వెంట రూ.60 కోట్ల అంచనాతో చేపట్టిన 2.5 కిలో మీటర్ల కరకట్ట నిర్మాణం పనులను ఇరిగేషన్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ ధర్మ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కరకట్ట నిర్మాణం డ్రాయింగ్‌ మ్యాప్‌ను ఆయన పరిశీలించి ఇప్పటి వరకు ఎంతమేరకు పనులు జరిగాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement