200 పడకలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

200 పడకలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో

వైద్యసేవలు బలోపేతం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి అర్బన్‌: 100 పడకలుగా ఉన్న జిల్లా ప్రధాన ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా విస్తరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని ఆస్పత్రి పనితీరు, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో వైద్యుల ఖాళీలు, పరికరాల మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బ్లడ్‌ బ్యాంక్‌లో ఫ్రిజ్‌ దెబ్బతిన్నా మరమ్మతులు ఎందుకు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. బ్లడ్‌ బ్యాంక్‌ 24 గంటలు నిరంతరాయంగా పనిచేయాలని ఆదేశించారు. పేదలకు నాణ్యమైన, అందుబాటు వైద్యసేవలు అందించాలంటే ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునిక సదుపాయాలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రి అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. ఆస్పత్రి అంబులెన్సులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అగ్నిమాపక పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎంఆర్‌ఐ సేవలకు అవసరమైన టెక్నీషియన్‌ నియామకానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఆస్పత్రిలో యూడీఐడీ గది ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాలకు అవసరమైన పరికరాల ప్రతిపాదనలు త్వరగా పంపాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరత్నం, వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement