భూపాలపల్లి: ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా దుకాణాల లైసెన్స్‌లు రద్దుచేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్‌లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో పాటు ఇఫ్కో, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఫర్టిలైజర్ హోల్‌సేల్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా తగినంత ఎరువుల నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు నిర్ణీత ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. యూరియాను అధిక ధరలకు విక్రయించే డీలర్లు, అక్రమంగా నిల్వచేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలను మరింత విస్తరించి రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. మండలాల వారీగా ఎరువుల వినియోగంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు వివరించారు. రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమంగా యూరి యాను ఇతర ప్రాంతాలకు తరలించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టంచేశారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార అధికారి వాలియానాయక్, భూపాలపల్లి, మహదేవపూర్ ఏడీఏలు రమేష్, శ్రీపాల్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


