● దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్
కాళేశ్వరం : కాళేశ్వరంలో నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజులపాటు కొనసాగే శ్రీసరస్వతి అంత్య పుష్కరాలుశ్రీ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి సరస్వతి ఘాట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న గోదావరి తీరం, మ్యూజియం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో జరిగే ఈ పుష్కర స్నానాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. అంత్య పుష్కరాల మొదటి రోజైన నేడు కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వచ్చి పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరించి ఈ వేడుకలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారని తెలిపారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు వసతి, తాగునీరు, ఘాట్ల వద్ద రక్షణ చర్యలతోపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతీ రోజు సాయంత్రం కాశీ పండితులచే సరస్వతి నది హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు.


