చిట్యాల : మండలంలోని కై లాపూర్‌లో ఉపాధి హామీ కూలీలకు బుధవారం సర్పంచ్ కోడారి ఓదెలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి అజీరా బేగం, ఉప సర్పంచ్ చింతల లక్ష్మీసదానందం, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, మేట్ రాజు, కూలీలు పాల్గొన్నారు.
చలివేంద్రం ఏర్పాటు
మల్హర్ (కాటారం) : కాళేశ్వరంలో నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నస్తురుపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సర్ పంతకాని తిరుమల తెలిపారు. సరస్వతి అంత్యపుష్కరాలలో పుణ్యస్నానం ఆచరిస్తే పాప పరిహారం కలుగుతుందని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందన్నారు. పుష్కరాల కాలమంతా ప్రతిరోజూ భక్తులకు చల్లని మినరల్ వాటర్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్ : ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరి అని జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ అన్నారు. జంగేడు పీఏసీఎస్‌లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఎం. భిక్షపతి పదవి విరమణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాక్స్ చైర్మన్ మేకల సంపత్, జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భిక్షపతి దంపతులను శాలువాతో సత్కరించారు. అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, బ్యాంకు మేనేజర్ జీవన్, డైరెక్టర్స్ పోషయ్య, పులి వేణుగోపాల్, రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
రేగొండ : వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని రూపిరెడ్డిపల్లిలో వీఓఏల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. వీఓఏలకు పని భారం తగ్గించి, కనీస వేతనం అమలు చేయాలన్నారు. వీఓఏలు ఐక్యంగా ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు.
డ్రెయినేజీల్లో పూడికతీత
గోవిందరావుపేట : మురుగు నీరు నిల్వ ఉండకుండా గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దుంపెల్లిగూడెం సర్పంచ్ బానోత్ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం గ్రామంలో డ్రెయినేజీలో మట్టి కూరుకుపోవడంతో సీతారాం నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ సిబ్బందితో పూడికతీత పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వానాకాలంలో దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.
పరామర్శ
ములుగు రూరల్ : జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రోజు సత్యంచారి బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను నాలుగో వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని నిరంజన్ పరామర్శించారు. అనంతరం సత్యం మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
వ్యక్తి ఆత్మహత్య
కన్నాయిగూడెం : భార్య చనిపోయిందన్న బెంగతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ సంఘటన కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామ పరిధిలో గల గొత్తికోయగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. గొత్తికోయగూడెనికి చెందిన మడవి జోగయ్య (45), భార్య గతేడాది పురుగుల మందు తాగి చనిపోయింది. అనంతరం భార్య లేదనే ఆలోచనతో కలత చెందిన భర్త జోగయ్య మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగయ్య కొడుకు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


