రేగొండ : రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వానాకాలం సీజన్‌లో మండలంలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. రేగొండ మండలంలోని పొనగండ్ల, రేపాక, కనిపర్తి, గూడెపల్లి, దుంపిల్లపల్లి, భాగిర్థిపేట, తిరుమలగిరి, రంగయ్యపల్లి, కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి, కొత్తపల్లి, నిజాంపల్లి తదితర గ్రామాల్లో మిరప పంటను సాగు చేశారు. మండల వ్యాప్తంగా మిరపకాయలు ఒకేసారి కోతకు రావడంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. వాతావరణంలో మార్పులకు ఈ ఏడాది మిరప పంటలో తెగుళ్లు, నల్లి బెడద తీవ్రంగా ఉంది. దీంతో మిరపలో తాలు శాతం పెరిగింది. ఏరిన మిరప కాయలను ఎండబెట్టిన తరువాత తాలు కాయాలు ఏరటానికి సైతం కూలీల అవసరం ఉంది. దీంతో మిరప కాయలు ఏరడంతో పాటు తాలు కాయలు వేరు చేసేందుకు కూలీల అవసరం ఉంది.
ఇతర మండలాల నుంచి కూలీలు..
గ్రామాల్లో కూలీలు దొరక్క పోవడంతో శాయంపేట, ఆత్మకూరు, మల్లంపల్లి మండలాల నుంచి ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్లలో కూలీలను తీసుకు వస్తున్నారు. రోజు కూలీ రూ.350తో పాటు ఆటో కిరాయి, మేసీ్త్ర మాములును కలుపుకుని దూరాన్ని బట్టి రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. క్వింటా ఎండు మిర్చి ఏరడానికి పది మంది పైగా కూలీలు అవసరం అవుతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం, ఎస్సారెస్పీ కాల్వలకు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తుండటంతో మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. డీబీఎం–38 కాల్వ ద్వారా సాగునీరు రావడంతో చాలా గ్రామాల్లో యాసంగి వరినాట్లు ముమ్మరంగా వేశారు. అలాగే మండలంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేశారు. దీంతో కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది.
అధిక ఖర్చుపై రైతుల ఆవేదన
ఇతర మండలాల నుంచి
మిరప కోతలకు కూలీలు


