ఆగని అక్రమ వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆగని అక్రమ వసూళ్లు

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

టేకుమట్ల : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు ఆయా కొనుగోలు కేంద్రాల్లోని ఇన్‌చార్జ్‌లకు వరంగా మారుతోంది. ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తుండడంతో కాంటా కాకపోవడఽంతో పాటు, గోదాములు లేక హమాలీల కొరతతో రైతులకు నరకప్రాయంగా మారింది. ఉదయం 8 గంటలకే తట్టుకోలేని ఎండలో కొనుగోలు కేంద్రాలకు చేరుకుని కాంటాల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో ఆన్‌లైన్‌ కావాలన్నా, కాంటాలు కావాలంటే రైతులు తప్పని సరిగా కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ముడుపులు చెల్లించాల్సిందే. కాదంటే మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో పాటు, రైతులు ఉండాల్సిందే. మండలంలోని రాఘవరెడ్డిపేట, వెల్లంపల్లి, ఎంపేడు, కుందనపల్లి, వెంకట్రావుపల్లి, రామకిష్టాపూర్‌(వి), గర్మిళ్లపల్లి, పంగిడిపల్లిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది.

అందరికీ వాటాలున్నాయా..?

మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. అయినా ఇప్పటి వరకు అధికారులు సెంటర్‌ ఇన్‌చార్జీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పై స్థాయి అధికారులకు సైతం వాటాలు ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తే వసూళ్ల దందా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై అధి కారులు పెదవి విప్పకపోవడంతో వాటాల వారీగా రైతులను పీల్చుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా డబ్బులు వసూళ్లను నిలిపివేయాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

రైతుల కష్టాలను ఆసరా

చేసుకుంటున్న సెంటర్‌ ఇన్‌చార్జ్‌లు

కొనుగోలు కేంద్రాల్లో

యథేచ్ఛగా వసూళ్ల పర్వం

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement