గణపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం గణపురం మండలకేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అనంతరం జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రం చౌరస్తా నుంచి కోటగుళ్ల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో గణపురం ఉప్పసర్పంచ్ ఓరుగంటి కృష్ణ, ఆర్కియాలజీ డైరెక్టర్ బుజ్జీ, సీనియర్ బ్యాట్‌మెంటన్ క్రీడాకారుడు మాడిశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల సందర్భంగా
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కాళేశ్వరం : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారం, అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్‌కు 90306 32608 నంబర్ కేటాయించినట్లు తెలిపారు. భక్తులు ఏవైనా సమస్యలు, సూచనలు లేదా సహాయం అవసరమైతే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
కొనసాగుతున్న మల్టీ
డిపార్ట్‌మెంట్ సమావేశాలు
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో సింగరేణి గనుల్లో మల్టీ డిపార్ట్‌మెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేటీకే 1వ గనిలో బుధవారం మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏరియా ఎస్‌ఓ టు జీఎం ఎస్.కవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతోపాటు భద్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఖర్చులను తగ్గిస్తూ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు జోతి, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, శ్యాంసుందర్, ప్రవీణ్‌విక్రమ్, కిశోర్, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు నజీర్, తదితరులు పాల్గొన్నారు.
పూసుకుపండ్లకు
భలే డిమాండ్
ఏటూరునాగారం: అభయారణ్యంలో సహజసిద్ధంగా లభించే పూసుకుపండ్లలో సీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అలాంటి పండ్లు మండల కేంద్రంలో గొత్తికోయలు బుధవారం కిలో రూ.20ల చొప్పున విక్రయించారు. వాటిని ఏటూరునాగారం ప్రాంత ప్రజలే కాకుండా వరంగల్ నుంచి వచ్చిన వారు సైతం విరివిగా కొనుగోలు చేశారు. ఇలాంటి పండ్లను పట్టణ ప్రాంతాల ప్రజలు చూసి ఉండరు. కేవలం 30 నిమిషాల్లోనే పండ్లను విక్రయించినట్లు గొత్తికోయ గిరిజనులు తెలిపారు.
మేలైన వరి వంగడాలను విత్తుకోవాలి
ఏటూరునాగారం: మేలైన వరి వంగడాలను విత్తుకోవాలని వరంగల్ శాస్త్రవేత్తలు శేషు, మధు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వరిసాగు పద్ధతులపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన మేలైన వరి రకాలైన కేఎన్‌ఎం 1638, ఆర్‌ఎన్‌ఆర్ 1508, సాంబమసూరి, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 118 వేసుకోవడం వల్ల పురుగులు, తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయన్నారు. రైతులు తమ పొలంలో పండించిన రకాలను జాగ్రత్తలు పాటించి విత్తనాలుగా రెండు, మూడు సంవత్సరాల వరకు విత్తనంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. అలాగే విత్తనాల మీద పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. వరిసాగు పద్ధతుల్లో మెలకువలు పాటించాలన్నారు. పంట మార్పిడి, సేంద్రియ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. వరి పంట వేసుకునే ముందు ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట పంటలను వేసుకొని పూత దశలో భూమిలో కలియదున్నాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, ఆత్మ చైర్‌పర్సన్ అరుణ మాట్లాడుతూ యూనివర్సిటీ నుంచి విడుదలైన మేలైన వరి రకాలను సాగు చేసుకోవాలని సూచించారు.


