వివిధ పంటల సాగు అంచనా వివరాలు(ఎకరాల్లో..)
భూపాలపల్లి రూరల్: జిల్లా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. నేల స్వభావం ఆధా రంగా అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ సూచి స్తోంది. జిల్లా రైతులు అధిక శాతం వర్షాధార పంటలపై ఆధారపడుతుండగా.. ఏటా వానాకాలంలో వరి, పత్తి, కంది, యాసంగిలో బోరుబావుల కింద వరి, వేరుశనగతోపాటు మొక్కజొన్న సాగుకు ప్రా ధాన్యం ఇస్తారు. ఈ ఏడాది వానాకాలంలో సాగు కానున్న పంట వివరాలు, అవసరమైన ఎరువులు, విత్తనాలతో సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు పర్యవేక్షణలో మండల వ్యవసాయశాఖ అధికారులు, ఏఈఓలు సిద్ధం చేశారు. ఎక్కువ మంది రైతులు పత్తి, వరి సాగుకు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి నివేదించారు.
సాగుపై అధికారులు అంచనా..
జిల్లాలో 2,16,734 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానుండగా.. 10,500 మెట్రిక్ టన్నుల యూరియా, 5,544 టన్నుల డీఏపీ, 5,544టన్నుల కాంప్లెక్స్ ఎరువులతోపాటు 2,772 టన్నుల పొటా ష్ అవసరమని అధికారులు అంచనాలు వేశారు. వరి, పత్తి సాగుకు సరిపోయేవిధంగా, అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. మెదటగా జీలుగ, జనుము విత్తనాలు సిద్ధం చేశారు. రైతులు తొలకరి వర్షాలకోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కువ మంది రైతులు రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు విత్తేందుకు ఆసక్తి కనబరుస్తారు. గత రెండు సంవత్సరాలుగా అకాల వర్షాలు, గులాబీ తెగులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి పత్తి, మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆయా పంటల సాగుకే రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంది. అదేవిధంగా వరి సాగుకు సైతం ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారు.
రైతులకు అవగాహన సదస్సులు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాగు, పంటల మార్పడి, అధిక దిగుబడి, ఎరువుల వాడకం తదితర అంశాలపై రైతులకు వివరిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
జిల్లాలో రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులోఉండేలా చర్యలు తీసుకుంటాం. పచ్చరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. నకిలీ విత్తనాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే కొనుగోలు చేయాలి. విత్తనాల కొనుగోలు బిల్లులు పంటలు చేతికొచ్చే వరకు రైతులు దాచిపెట్టాలి.
– బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి
పంట గతేడాది ఈఏడాది అంచనా
వరి 95,653 1,09,854
పత్తి 98,280 1,06,560
కందులు 38 120
పెసర 78 110
బబ్బెర్లు 45 90
మొత్తం 1,94,094 2,16,734
ఎరువులు 24,360 మెట్రిక్ టన్నులు
అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉండేలా వ్యవసాయాధికారుల చర్యలు


