మాట్లాడుతున్న ఎస్పీ సంకీర్త్
హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బంది
కాళేశ్వరం : నేటి నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున భక్తులకు అసౌకర్యం కలుగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బుధవారం ఆయన పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బందోబస్తు ఏర్పాట్లపై వివరించారు. ముందుగా ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్‌ల వద్ద భద్రత, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్ భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, పరిశీలించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. పుష్కరాల్లో తప్పిపోయిన వారి సహాయక కేంద్రాలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇతర అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పుష్కరాల విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీఎస్ టీమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖకు సహకరించి సూచనలు పాటిస్తూ పుష్కరాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ సంకీర్త్ కోరారు.
ఎస్సీ సిరిశెట్టి సంకీర్త్


