పుష్కరాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు
భూపాలపల్లి: మూడు రాష్ట్రాల సరిహద్దులోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు ముందస్తు ఏర్పా ట్లు చేశాం. గతంలో జరిగిన పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వన్ వే ఏర్పాటు చేశాం. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఏఐ డ్రోన్‌ను సైతం వినియోగించబోతున్నాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా, వారి భద్రతే ప్రధాన ధ్యేయంగా పని చేసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. అంత్య పుష్కరాల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఎస్పీ సాక్షికి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే..
పుష్కరాల సందర్భంగా ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వాడుతాం. ఏఐ డ్రోన్‌ను వినియోగించి కాళేశ్వరం పోలీస్‌స్టేషన్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యవేక్షిస్తాం. వాహనాలు, భక్తుల సంఖ్యను సైతం ఏఐ డ్రోన్ లెక్కిస్తుంది. తద్వారా భక్తుల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యను ముందుగానే గమనించి పరిష్కరించవచ్చు. ఇప్పటికే కాళేశ్వరంలో ఉన్న సీసీ కెమరాలు కాకుండా మరో 150 కెమెరాలను బిగించాం. కమాండ్ కంట్రోల్ రూంను కాళేశ్వరం ఠాణాలో ఏర్పాటు చేశాం. పుష్కర ఘాట్, దేవాలయ పరిసరాల్లో మరో మూడు డ్రోన్‌లతో నిత్య పర్యవేక్షణ ఉంటుంది.
సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు వన్ వే ఏర్పాటు చేశాం. పెద్దపల్లి జిల్లా మంథని తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గంగారం ఎక్స్‌రోడ్ నుంచి అన్నారం, మద్దులపల్లి మీదుగా, హనుమకొండ, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు కాటారం మండలం బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా గంగారం ఎక్స్‌రోడ్, అన్నారం మీదుగా కాళేశ్వరానికి చేరుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మీదుగా కాటారం చేరుకున్నాక హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్‌కు సమస్య తలెత్తకుండా కాళేశ్వరానికి మూడు వైపులా సుమారు 250 ఎకరాల్లో 23 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఎన్ని వాహనాలు వచ్చినా ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు.
పుష్కరాల సందర్భంగా సుమారు వేయి మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. నాతో పాటు అదనపు ఎస్పీ, 12మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మందికి పైగా ఎస్సైలు, మరో 900 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అంచనాకు మించి భక్తుల సంఖ్య పెరిగితే పోలీసు సిబ్బందిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం.
ఏఐ డ్రోన్‌తో పర్యవేక్షిస్తాం
సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేశాం
వన్ వేకు వాహనదారులు సహకరించాలి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


