భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మిక హక్కులను రక్షిస్తూ సంస్థను సంరక్షించడమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీబీజీకేఎస్) లక్ష్యమని ఆ సంఘం వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని కాకతీయ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పరిస్థితి దయనీయంగా మారిందని, సంస్థ ప్రైవేటీకరణ అంచున ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో సింగరేణి అప్పుల ఊబిలోకి వెళ్లిందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మండ సంపత్, లక్ష్మణ్, రాకేష్ రెడ్డి, అనిల్, సాంబయ్య, కిషన్ పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యం
ములుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావును ఆయన కలిశారు. జిల్లాలో రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మచైర్మన్ రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఓరుగంటి అనిల్, మట్టెవాడ తిరుపతి, మాదారపు రాజు పాల్గొన్నారు.
తవ్వకాల్లో బయటపడిన రాళ్ల పరిశీలన
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం తవ్వకాల్లో బయటపడిన రాళ్లను మంగళవారం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ ఎస్‌ఎస్ రంగాచార్యులు, డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయానికి సంబంధించిన రాళ్లుగా అనుమానించారు. రాళ్ల కొలతలను తీసుకుని శాసీ్త్రయ పద్ధతిలో ఆధారాలు సేకరించారు. శిల్పం, గుడి ఆనవాళ్లు, గుడి ఆకారం బయటపడలేదని, గుడికి సంబంధించిన ఇటుకలు సైతం కనిపించలేదని తెలిపారు. పూర్తి నివేదికను తయారు చేసి పురావస్తు శాఖకు అందించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ షురూ
● అన్ని సబ్జెక్టులు కలిపి
88,512 జవాబుపత్రాలు
విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించారు. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబుపత్రాలు మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పేపర్ 2 జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ ఎ.గోపాల్, ఏసీఓ జనరల్–1 శ్రీనివాస్‌రావు తెలిపారు.రెండో దశలో ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు.


