భూపాలపల్లి రూరల్: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక రూ.3,210.51 కోట్లుగా నిర్దేశించినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ వెల్లడించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావులో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా విస్తృత స్థాయిలో రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతు బీమా, ఉపాధి హామీ పథకం తదిత ర నిధులు నిలుపుదల చేస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులను ఆపకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని సూచించారు. పంట రుణాలు బాకీ ఉన్న రైతుల జాబితా ఇస్తే అవగాహన కల్పించి రికవరీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ మేనేజర్ తిరుపతి, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్‌సాయి, నాబార్డ్ డీడీఎం టీసీ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, మెప్మా పీడీ రాజేశ్వరి పాల్గొన్నారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
చిట్యాల/గణపురం: ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం చిట్యాల మండలం కై లాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహా రైస్‌మిల్లు, గణపురం మండలకేంద్రంలోని జానికరామ్ రైస్ మిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మిల్లు యాజమానులు వరి ధాన్యంలో తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లు యాజమానులు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని ఎక్కువగా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఏం రాములు, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, మార్కెట్ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాల
అభివృద్ధికి కృషి
కలెక్టర్ రాహుల్ శర్మ


