కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల పనుల్లో భాగంగా మ్యూజియం నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు, టెంట్ సిటీ, మ్యూజియం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, మిగిలిన పనులను బుధవారం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. మ్యూజియం పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం చేయాలన్నారు. పరిశుభ్రత, భద్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, డీఎస్పీ సూర్యనారాయణ, ఆర్డీఓ రవీందర్, దేవస్థానం ఈఓ మహేష్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు,
టెంట్ సిటీ పరిశీలన


