మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్యాబోధనతో పాటు కార్పొరేట్ స్థాయికి దీటుగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతీ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి తగ్గ అంశాలలో తర్ఫీదు అందిస్తున్నామన్నారు. బాలికల ఆత్మరక్షణకోసం కరాటే శిక్షణ, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పొందేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్‌రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్ అధికారి సామల రమేష్, బీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్‌రెడ్డి, సర్పంచ్ చాట్ల విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్


