భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేటీకే 5వ గనిలో నిర్వహించిన మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్యం, విద్య, భద్రత అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు కూడా ధైర్యంగా ముందుకు సాగుతూ భూగర్భ గనుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి


