టేకుమట్ల: ప్రభుత్వాలు పల్లెల్లో వలసలను నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. గత సంవత్సరం వరకు ఉపాధి కూలీల హాజరు నమోదును మ్యానువల్‌గా ఉండగా ఉపాధిలో అవకతవకలు జరుగుతున్నాయనే కారణంతో ప్రభుత్వాలు ఉపాధి పథకాన్ని పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ నమోదు చేశాయి. ఉపాధి కూలీల హాజరు నుంచి చేయాల్సిన పనులు, పని ప్రదేశం, పని దినములు వంటి అంశాలన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. దాంతో ఉపాధి హామీ పథకం మొత్తం ఆన్లైన్‌లో నిక్షిప్తం అవుతోంది.
ఉపాధి కూలీలకు తిప్పలు
గతంలో ఉపాధి కూలీలు నేరుగా పని ప్రదేశానికి చేరుకుని పని చేసి తిరిగి ఇంటికి వచ్చే వారు. కూలీలు పని చేస్తున్న సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ హాజరును నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం ఉపాధి కూలీలు పనికి వెళ్లే ముందు ఎన్‌ఆర్‌ఈజీఏ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌లో తప్పని సరిగా క్యాప్చర్ మస్టర్ రోల్‌లో ఉదయం, మధ్యాహ్నం హాజరు నమోదు చేయాలి. హాజరు నమోదు ప్రక్రియలో ఐరిస్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా మంది కూలీల కళ్లు నమోదు కాకపోవడంతో వెనుతిరిగి వెళ్తున్నారు. మరికొంత మంది కూలీలకు ఈ కేవైసీ చేయడంతో హాజరు నమోదుకు సమస్య లేకుండా పోతుంది. మరికొంత మంది కూలీలకు ఆధార్ అప్‌డేట్ చేసినా క్యాప్చర్ మస్టర్ రోల్‌లో హాజరు అనుమతించకపోవడంతో పని ప్రదేశానికి వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు. ఇప్పటి వరకు మండలంలోని 25 గ్రామాలలో ఐరిష్ సమస్యతో ఎంతో మంది కూలీలు ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఇప్పటికై నా అధికారులు ఐరిష్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తే మరెంతో మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని పలువురు కోరుతున్నారు.
మస్టర్‌లో పేరున్నా ఐరిస్ రాని వైనం
ఖాళీగా ఉంటున్న ఉపాధిహామీ కూలీలు


