న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026
అంత్య పుష్కరాలకు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసేవలు అందించేందుకు ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. 12రోజుల పాటు వైద్యశిబిరాలు, మెడికల్ క్యాంపులో వైద్యసేవలు అందించేందుకు సిబ్బందిని కూడా కేటాయించారు. భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి స్పెషలిస్టు వైద్యులను కేటాయించారు.
10క్యాంపులు..
కాళేశ్వరంలో 11రోజుల పాటు మూడు షిఫ్టులో 10 మెడికల్ క్యాంపులు, రెండు తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటుచేయనున్నారు. ముక్తీశ్వర ఆలయ సమీపం, పాత ఈఓ కార్యాలయం, టెంట్ సిటీ, పార్కింగ్–1, పార్కింగ్–2, తాత్కాలిక బస్టాండ్, హరిత హోటల్, పాత బస్టాండ్, గోదావరి మెయిన్ ఘాట్, సరస్వతి ఘాట్ సమీపాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలో 20 పడకలు, సరస్వతి ఘాట్ వద్ద మరో 20 పడకలు కలిగిన తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేయనున్నారు. ఒక్క వైద్యశిబిరంలో ఒక డాక్టర్(ఎంఎల్‌హెచ్‌పీ), హెల్త్ సూపర్‌వైజర్, ఇద్దరు చొప్పున ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలను నియమించారు. ముందుగా వైద్యశిబిరంలో మాత్రలు అందజేయనున్నారు. అక్కడ తగ్గకపోతే తాత్కాలిక వైద్యశాల తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి అత్యవసరమైతే మహదేవపూర్‌లోని సీహెచ్‌సీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
రెండు తాత్కాలిక ఆస్పత్రులు
కాళేశ్వరంలోని పీహెచ్‌సీ, సరస్వతి ఘాట్‌ల వద్ద తాత్కాలికంగా 20 పడకల చొప్పున ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు సిద్ధంచేశారు. ఆక్సిజన్, పల్స్‌మీటర్, ఈసీజీ సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, వైద్యాధికారులు ఇద్దరు, ల్యాబ్‌టెక్నీషియన్, పార్మసిస్టు, స్టాఫ్‌నర్సులను నియమించనున్నారు. ప్రతీ మెడికల్ క్యాంపు వద్ద ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మరో ఐదు బైక్ అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
పీహెచ్‌సీలకు ఇబ్బంది కలగకుండా..
కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 11 రోజుల పాటు ఇబ్బందులు కలగకుండా వైద్యాధికారుల, సిబ్బంది కేటాయింపులు చేశారు. ఆర్‌బీఎస్‌కే, పల్లె దవాఖానాలు, పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఒక్కొక్కరిని, సిబ్బందిని కూడా అదేవిధంగా ఎక్కువ మంది ఉన్న సిబ్బందిని కాళేశ్వరం విధులకు పంపించే విధంగా ఏర్పాటు చేశారు.
డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ..
కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ పర్యవేక్షించనున్నారు. వైద్య సిబ్బందికి విధులు కేటాయించి వారు అందిస్తున్న సేవలు, ఇబ్బందులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. మరో ఇద్దరు ఇతర జిల్లాల డీఎంహెచ్‌ఓలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు మానిటరింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు.
కాళేశ్వరంలో 10 వైద్యశిబిరాలు
10 పడకలతో 2 మెడికల్ క్యాంపులు
30 మంది డాక్టర్లు..
420 మంది వైద్యసిబ్బంది
ప్రత్యేకంగా రెండు టీమ్‌ల ఏర్పాటు


