● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరాలు సంస్థ, వ్యవసాయ, రవాణా, సహకార శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్‌లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రవాణా, మిల్లింగ్ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పుష్కర విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
సరస్వతి అంత్య పుష్కరాల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పుష్కర విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. 12 రోజులు చాలా ప్రధానమన్నారు. విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, తగు చర్యలు నిమిత్తం ఆయా శాఖలకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు స్వామీజీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇబ్బంది లేకుండా చర్యలు
కాళేశ్వరం: భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అధికారులతో కలిసి ఆయన పుష్కరాల పనులను పరిశీలించారు. ప్రధాన ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్ భక్తుల సౌకర్యార్థం గోదావరి నదిలో క్వయర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. భక్తులు సమాచారం తెలుసుకునేలా తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ముఖ్య మైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ అధికారులు పాల్గొన్నారు.


