● ఎన్‌డీఎంఏ అబ్జర్వర్ ప్రవీణ్
కాళేశ్వరం: అడవుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని, ప్రజల సహకారంతో అటవీ రక్షణ చర్యలు సమర్థవంతంగా నిర్వహించవచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) అబ్జర్వర్ ప్రవీణ్ తెలిపారు. అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణపై ఎన్‌డీఎంఏ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలకు సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌డీఎంఏ అబ్జర్వర్ ప్రవీణ్ మాట్లాడుతూ అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలు, వాటి వల్ల ప్రకృతి సంపద, వన్యప్రాణులు, పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేశారు. అటవీ, అగ్ని ప్రమాదాల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మూడు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహించారు. మాక్‌డ్రిల్స్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, అగ్ని నియంత్రణ పద్ధతులు, భద్రత చర్యలు, సత్వర స్పందనపై ప్రదర్శనలు నిర్వహించారు. అడవుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎండిన ఆకులు, గడ్డి లేదా చెత్తను కాల్చకుండా ఉండాలన్నారు. బీడీలు, సిగరెట్ ముక్కలు వంటి మండే వస్తువులను అడవుల్లో వేయకూడదని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా అగ్ని కనిపించిన వెంటనే సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ ఎఫ్‌డీఓ సందీప్, భూపాలపల్లి ఎఫ్‌డీఓ అప్పలకొండ, ఎఫ్‌ఆర్‌ఓ రవి, ఇక్బాల్, డివిజన్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


