ఎమ్మెల్యేను కలిసిన నాయకులు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను కలిసిన నాయకులు

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

భూపాలలపల్లి రూరల్‌ : ఫర్టిలైజర్స్‌, ఫెస్టిసైడ్స్‌, సీడ్స్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ జిల్లా అసోసియేషన్‌ నూతన కమిటీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులకు ఎమ్మెల్యే శుభాకాఃక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కట్కం అశోక్‌, జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ కోట రాజబాబు, అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు యాంసాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నలిగేటి సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి కృషి

కాళేశ్వరం : కాళేశ్వరం దర్శనానికి వచ్చే భక్తులకు ఉపయోగపడే విధంగా రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ పాలకులకు వార్డు సభ్యుడు రెవెల్లి రాకేష్‌ ఇటీవల దరఖాస్తు చేశారు. దీంతో పాత నక్ష దారి ప్రకారం ఎయిర్‌టెల్‌ టవర్‌ నుంచి బ్రిడ్జి రోడ్‌ వరకు రోడ్డు తీయాలని కోరగా పాలకులు స్పందించారు. గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ అధికారులు, పాలకవర్గం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

మాజీ ఎంపీటీసీ మృతి

మహాముత్తారం : మండలంలోని పోలారం మాజీ ఎంపీటీసీ, ములుగుపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం రాజబాపు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పరామర్శించారు.

బీజేపీ బూత్‌ కమిటీ అధ్యక్షుడు..

చిట్యాల : మండలంలోని కాల్వపల్లికి చెందిన బీజేపీ బూత్‌ అధ్యక్షుడు బిస్కుల రవి అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా సోమవారం ఆయన మృతదేహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం మండలంలోని గాంధీనగర్‌ గ్రామానికి చెందిన బీజేపీ దళిత మోర్చా జిల్లా నాయకుడు రత్న రమేష్‌ తల్లి సమ్మమ్మ అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్‌ గౌడ్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ సెల్‌ కన్వీనర్‌ పంచిక మహేష్‌, ప్రధాన కార్యదర్శి రాకేష్‌, ఉపాధ్యక్షుడు నల్ల శ్రీనివాస్‌ రెడ్డి, చింతల రాజేందర్‌, సంఘ రఘపతి తదితరులు పాల్గొన్నారు.

గోదావరిలో ఇసుక తవ్వితే చర్యలు

ఏటూరునాగారం : అనుమతి లేకుండా గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడితే వాహనాలను సీజ్‌ చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని ఆర్‌ఐ చిక్కుల కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ముళ్లకట్ట వద్ద గోదావరి లోకి వాహనాలు వెళ్లకుండా ట్రంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రివేళలో దొంగతనంగా ఇసుకను లారీల్లో తరలిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. వాటిని అరికట్టేందుకు గోదావరిలోకి వాహనాలు వెళ్లకుండా కందకాలు తీయడం జరిగిందన్నారు. కందకాలను ఎవరైనా పూడ్చివేస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. కొంతమంది ట్రాక్టర్‌ యజమానులు సైతం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం ఉందన్నారు. వారిపై కూడా చర్యలు చేపడుతామన్నారు. జీపీఓ వెంకటనర్సమ్మ పాల్గొన్నారు.

క్షయ రహిత సమాజానికి కృషి

గోవిందరావుపేట: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా ఉచిత మొబైల్‌ చెస్ట్‌ ఎక్స్‌రే స్క్రీనింగ్‌ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, జ్వరం, దగ్గు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా చెస్ట్‌ ఎక్స్‌రే స్క్రీనింగ్‌ చేయించుకోవాలని సూచించారు. ఎస్‌టీఎస్‌ రాజు, టీబీ అలెర్ట్‌ ఇండియా జిల్లా కో ఆర్డినేటర్‌ టి రాజు, ఎక్స్‌రే టెక్నీషియన్‌ సంతోష్‌, హెచ్‌వీ శ్యామల, ఏఎన్‌ఎంలు శకుంతల, సుజాత, హెల్త్‌ అసిస్టెంట్లు జంపయ్య, కృష్ణయ్య, సదానందం, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement