కానరాని సూచిక బోర్డులు
చిట్యాల : మూల మలుపులతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.. మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. మండలంలోని జడలపేట గ్రామ పంచాయతీ నుంచి నైన్‌పాకకు వెళ్లే ప్రధాన రోడ్డు వైపు ఉన్న మూల మలుపులతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు అక్కడ ప్రమాదకరం అనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు అనేక గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తున్నారు. మూల మలుపులు ఉన్న కారణంగా గతంలో ఈ ప్రాంతంలో కొందరు మండలంలోని గాంధీనగర్, నైన్‌పాక గ్రామాలకు చెందిన వాహనదారులు గాయపడి మృతి చెందారు.
భయం భయంగా ప్రయాణం..
నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక రాత్రివేళ అయితే వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూలమలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వాహనదారులు ఎదురెదురుగా ఢీకొనే దుస్థితి ఏర్పడుతుంది. అధికారులు మండలంలోని పలు గ్రామాల్లోని మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు, పాలకులు
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
జడలపేట నుంచి నైన్‌పాక వెళ్లే ప్రధాన రోడ్డుపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. గతంలో అనేక వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఉన్నాయి. మూల మలుపుల వద్ద సంబంధిత అధికారులు వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలి. – దామెరబోయిన నారాయణరావు, బావ్‌సింగ్‌పల్లి


