మల్హర్(కాటారం) : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కాటారం మండలంలోని అన్నపూర్ణ రైస్‌మిల్లు, జంగేడులోని పీఏసీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల్లో ధాన్యం దిగుమతులు, నిల్వలు, నాణ్యతా ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం స్టాక్‌లను పరిశీలించి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే అన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, వాహనాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం నిల్వ, రవాణా, రికార్డు నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో ట్యాబ్ ఎంట్రీల ప్రక్రియను ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహించాలని జిల్లా సహకార అధికారిని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు 24 గంటలలోపు నమోదయ్యేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎటువంటి అవాంతరాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, సహకార అధికారి వాల్య నాయక్, సివిల్ సప్లయి ఇన్‌స్పెక్టర్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా కొనుగోళ్లు చేయాలి
రేగొండ : కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని డీఆర్‌డీఓ బాలకకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని రంగయ్యపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు, మార్కెటింగ్ నిర్వాహకులు, రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కొనుగోళ్లు కొనసాగించాలన్నారు. ఎంఎస్‌పీ పూర్తి స్థాయిలో అందేందుకు దళారీ వ్యవస్థకు తావు లేకుండా చూడాలన్నారు. అలాగే మండల కేంద్రంలో నిర్వహించిన వీఓఏ సమావేశానికి హాజరై అర్హులందరికి అవకాశం కల్పించి ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్‌రాజ్, ఏపీఓ, ఈజీఎస్, మండల సమాఖ్య అధ్యక్షులు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్


