మొగుళ్లపల్లి: ఇంటర్మీడియేట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో మొగుళ్లపల్లి, చిట్యాల, గణపురం, కాటారం, మల్హార్, మహాముత్తారం మండలాల్లో ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపుల్లో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు.
ప్రక్రియ ఇలా..
పదవ తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియేట్‌లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియేట్ సిలబస్‌తో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ కూడా ఇస్తారు.
బాలికలకు హాస్టల్ సౌకర్యం..
ఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియేట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్‌కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
25వ తేదీ వరకు గడువు


