కాళేశ్వరం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానాకష్టాలు పడుతున్నారు. కాంటా వేసేటప్పుడు తేమశాతం ఉందని కొర్రీలు పెడుతున్నారు. అదే ధాన్యం కాంటావేసి లారీలు లోడు తీసుకుపోయేందుకు రాక కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. రాత్రిపగలు ధాన్యం కేంద్రాల్లోనే బసచేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తుండడంతో వడగండ్ల వాన కురిస్తే ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దళారులను కొంతమంది రైతులు ఆశ్రయించి నష్టపోతున్నారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.
ధాన్యం సేకరణ ఇలా..
జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. యాసంగి లక్ష్యం 1.60లక్షల టన్నులు కాగా ఇప్పటివరకు 15వేల టన్నులకు పైగా మిల్లులకు వెళ్లినట్లు సమాచారం. రూ.32 కోట్లకు రూ.5కోట్ల వరకు రైతులకు చెల్లించారని తెలిసింది.
అధికారుల నిర్లక్ష్యం..
రైతుల ఆవేదన రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. పక్షం రోజులుగా గన్నీ సంచుల్లో వడ్లు నింపి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా లారీలు అందుబాటులోకి రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులు, లారీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ధాన్యం లోడింగ్ ప్రక్రియ పూర్తిగా నత్తనడకన సాగుతోందని వాపోతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండల్లో రోజంతా వేచిచూడాల్సి వస్తుండగా, రాత్రులు కూడా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తుండటంతో ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట తడిసిపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు కన్నీరుపెడుతున్నారు.
దళారుల దందా..
లారీలు రావడం లేదని దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. కొందరు దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 వరకు తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తూ తమ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు చేసేదేమీ లేక ఎంతో కొంతకు దళారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
మిల్లుల్లో ఆలస్యం..
కళ్లాల్లో ధాన్యం లోడ్ చేసుకుని మిల్లులకు వెళ్లిన లారీల్లో ధాన్యం సంచులు దించేందుకు హమాలీ ఎండ తీవ్రతకు సరిగ్గా రావడం లేదు. దీంతో మిల్లుల్లో నాలుగు రోజుల కాలవ్యవధి జరుగుతుండడంతో లారీలు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. లారీ కాంట్రాక్టర్లు కూడా కేంద్రాలకు రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు లారీ డ్రైవర్లు పనికి రావడం లేదని తెలుస్తోంది. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి లారీల కొరతను తీర్చడంతో పాటు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి దళారుల నుంచి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ డీఎం రాములును వివరణ కోరడానికి సంప్రదించగా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
కల్లాల్లోనే రైతుల పడిగాపులు
ఎండ తీవ్రతతో లారీల్లో లోడు దించక ఆలస్యం
దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
క్వింటాకు రూ.200–300 వరకు రైతుకు నష్టం
మిల్లుల వద్ద ఆలస్యం
కావడంతోనే..
మిల్లులకు వెళ్లిన లారీలు మూడు, నాలుగు రోజుల వరకు హమాలీ దించడం లేదు. ఎండకు లారీ డ్రైవర్లు కూడా పనికి రావడం లేదు. దీంతో లారీలు కల్లాల వద్దకు రావడం లేదు.
– శ్రీనివాస్‌రెడ్డి,
సివిల్ సప్లయీస్ లారీ కాంట్రాక్టర్


