నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

భూపాలపల్లి రూరల్‌: నేడు (సోమవారం) కాళేశ్వరంలో నిర్వహించనున్న నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మాక్‌డ్రిల్‌, సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల కార్యక్రమాల్లో జిల్లా అధికారులు పాల్గొనాల్సి ఉన్నందున నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత కార్యక్రమాల దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండరన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం దరఖాస్తులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.

పరుచుకున్న పచ్చదనం

మహాముత్తారం: ఎండలు మండిపోతున్నాయి. చెట్లు కూడా ఎండిపోయి.. ఆకులు రాలిపోతున్నాయి. కానీ మహాముత్తారం మండలంలోని జీలపల్లి నుంచి పర్లపెల్లి వెళ్లే ఈ రహదారి వెంబడి ఉన్న చెట్లు మాత్రం పచ్చదనంతో కొమ్మలు అల్లుకొని పచ్చదనం పరుచుకుంది. బాటసారులు, వాహనదారులు ఆహా ఎంత పచ్చదనం అంటున్నారు.

నేటినుంచి యువజన వారోత్సవాలు

భూపాలపల్లి అర్బన్‌: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటినుంచి ఈ నెల 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ చిర్ర రఘు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ‘ఫిట్‌ అండ్‌ ఆక్టివ్‌ తెలంగాణ మారథాన్‌ అండ్‌ ఫిజికల్‌ లిటరసీ’ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి, మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి మారథాన్‌ హనుమాన్‌ టెంపుల్‌ నుంచి అంబేడ్కర్‌ స్టేడియం వరకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువత అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

యువత అన్ని రంగాల్లో రాణించాలి

భూపాలపల్లి అర్బన్‌: ఆధునిక కాలంలో యువత విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.రమణరావు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాలలో చివరి రోజైన ఆదివారం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కళాశాల పూర్వ విద్యార్థులు, కళాశాల క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలు, కళలు వంటి అన్ని రంగాలలో ప్రావీణ్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

ఎప్‌సెట్‌లో అంజన్నకు 1,661 ర్యాంకు

పలిమెల: మండల కేంద్రానికి చెందిన జనగామ అంజన్న ఆదివారం విడుదలైన ఎప్‌సెట్‌ ఫలితాల్లో 1,661 ర్యాంక్‌ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అంజన్న పదవ తరగతిలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి ప్రభుత్వ సీఓఈ కాలేజీలో సీటు సాధించాడు.

‘సువైభ’కు నగదు పురస్కారం

కాళేశ్వరం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియేట్‌ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మహదేవపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని సువైభ బైపీసీ విభాగంలో 985 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్‌ రూ.10 వేల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ ప్రసాద్‌, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement