ఏటూరునాగారం: మావోయిస్టులు, సల్వాజుడుం గొడవలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గొత్తికోయ గిరిజనులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని వదిలి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి 15 ఏళ్ల క్రితం వలసవచ్చారు. ఏటూరునాగారం దట్టమైన అటవీ ప్రాంతంలోని అడవులను శుభ్రం చేసుకుని ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలతో కాలం గడుపుతున్నారు. ఇక్కడే ఆధార్, రేషన్, ఉపాధిహామీ కార్డులను సై తం పొందారు. స్థానికంగా జీవనస్థితి బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ సాగు చేసుకున్న భూములకు ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడం.. కేవలం సాగు ఫలాలు మాత్రమే అనుభవించాలని ఫారెస్టు, రెవె న్యూ అధికారులు గిరిజనులకు చెబుతూ వస్తున్నా రు. ఈ క్రమంలో ఇటీవల అటవీ భూముల్లో సైతం అటవీశాఖ అధికారులు గోతులు తవ్వడం, పోడు భూముల్లో మొక్కలను నాటే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో ఈ భూములను ఎప్పటికై నా ప్రభుత్వం లాక్కుంటుందని గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో సైతం మావో యిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో తిరిగివెళ్లాలనే గొత్తికోయలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
సల్వాజుడంతోనే వలసలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు అక్కడి పోలీసులు అప్పటి దివంగత సీఎం మహేంద్రకర్మ గిరిజన యువకులతో సల్వాజుడు మిలటరీ ప్లాట్స్‌ను ఏర్పాటు చేయించారు. గిరిజనుల్లో సల్వాజుడుం పోలీసు బెటాలియన్ సభ్యులున్నారని భావించిన మావోయిస్టు పార్టీ యువకులను టార్గెట్ చేసుకొని గిరిజన కుటుంబాలపై దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ పోరాటాలను తట్టుకోలేక 2001 నుంచి 2022 వరకు ఏటూరునాగారం సమీపంలోని గోదావరి దాటి అడవుల్లోకి వలస వచ్చారు. క్రమక్రమంగా వారు మంగపేట, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలకు విస్తరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 మండలాల్లో 51 గూడేల్లో 3,945 జనాభా ఉంది. వీరంతా సమీప అడవిలో పోడు చేసుకొని వారికి తోచిన వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆపరేషన్ కగార్‌తో తగ్గిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2025–26లో వేలాది మంది మావోయిస్టులు అమరులయ్యారు. చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ పల్లెలు సైతం మావోయిస్టులు లేని పల్లెలుగా మారాయి. ఇటీవల కర్రెగుట్టల్లో సైతం సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులు లేని ప్రాంతాలుగా గిరిజన గ్రామాలు మారాయని భావించిన ఇక్కడున్న గొత్తికోయలు మళ్లీ అక్కడికి వెళ్లాలని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతీ గిరిజనుడికి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఇళ్లు, పట్టా భూములు కలిగి ఉన్నారు. పట్టా భూములపై హక్కులు ఉండడంతో మళ్లీ అక్కడకు వెళ్లి వ్యవసాయం చేసుకొని స్వేచ్ఛగా జీవించవచునే భావనతో గొత్తికోయలు ఉన్నారు.
15 ఏళ్ల క్రితం ఏజెన్సీకి
వలసొచ్చిన గొత్తికోయలు
మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో
పునరాలోచన
జిల్లాలో 51 గూడేల్లో..
3,945 మంది నివాసం


