కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్‌లు రానున్నాయి. అక్కడే కంటెయినర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షామియానాలు, మ్యాట్‌లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
15 చెక్‌పోస్టుల ఏర్పాటు
సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్‌వే అమలులోకి రావడంతో చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి.
శివ కల్యాణ మండపంలో హోమాలు
ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పా ట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. చివరి మూడు రోజులు రుద్రయాగం నిర్వహించడానికి శృంగేరి పీఠం నుంచి వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి.


