విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

ములుగు/ములుగు రూరల్‌: సమాజంలో విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, అక్షరజ్ఞానం మనిషిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌ హాల్‌లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విద్య విజయోత్సవ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కార్పొరేట్‌ స్థాయికి మించిన మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తుందని తెలిపారు. విద్యారంగంలో జిల్లాకు ప్రత్యేకమైన విశిష్టత లభించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల చూపు జిల్లా వైపే ఉందని వెల్లడించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యా రంగంలో జిల్లా సాధిస్తున్న పురోగతిని మంత్రి కొనియాడారు. ఫలితాల్లో బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉండడం అభినందనీయమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement