భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం హామీ ఇచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఏరియాలోని కొమురయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిగాయని, త్వరలో మెడికల్ బోర్డు నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్‌గ్రౌండ్ అలవెన్సుల కోతలు నిలిపివేయాలని, ఆస్పత్రి బిల్లుల పేరుతో వేతనాల నుంచి కోత విధించరాదని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 337 మంది డిపెండెంట్లకు త్వరలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. డిస్మిస్ కార్మికుల సమస్యలు, మారుపేరు సమస్యలు, ఓవర్‌మెన్ల పెండింగ్ ప్రమోషన్ల పరిష్కారానికి కూడా యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, మాతంగి రామచందర్, జి శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం పాల్గొన్నారు.


