కాళేశ్వరం: కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్ వద్ద కార్మికులు తినిపారేసిన ఆహార కవర్లు, చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. సరస్వతీనది అంత్య పుష్కరాల ఏర్పాట్లలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట వారికి భోజనాన్ని కవర్లలో అందిస్తున్నప్పటికీ, వాటిని నిర్లక్ష్యంగా ఘాట్ పరిసరాల్లోనే పడేస్తున్నారు. దీంతో ఘాట్ ప్రాంతం అపరిశుభ్రంగా మారి భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. దేవాదాయ, పంచాయతీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
సరస్వతీఘాట్‌లో ముమ్మర ఏర్పాట్లు
భక్తులు నడిచేందుకు వీలుగా సరస్వతీఘాట్ నుంచి గోదావరిలో నీటి వరకు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు పూర్తయిన తరువాత వెదురు చలువ పందిర్లు వేయనున్నారు. వీఐపీ ఘాటు వద్దనే భక్తుల కోసం డార్మెటరీ రూమ్‌లు, స్టాల్స్ ఏర్పాటు, టెంట్ సిటీ ఏసీ, నాన్ ఏసీ రూమ్‌ల నిర్మాణం చేపట్టారు. పార్కింగ్ స్థలాలు చేపట్టారు. ఈనెల 20 వరకు పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


